My Yukon Show - యుకాన్‌లో కరోనా

 My Yukon Show పేరిట ఇక్కడి విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆసక్తి వుంటే చదవండి - లేకపొతే లైట్ తీస్కోండేం.

యూకాన్ అనేది కెనడాలోని ఒక కేంద్ర పాలిత ప్రాంతం. అలాంటి ప్రాంతాలు ఈ దేశంలో మరో రెండు వున్నాయి. ప్రాంతం పెద్దదే కానీ జనాబా తక్కువ. సులభంగా వుండేందుకై ఈ ప్రాంతాన్ని రాష్ట్రంగా వ్రాస్తాను. ఈ రాష్ట్ర జనాభా 44 వేలు వుంటుంది. అందులో రాజధాని వైట్‌హార్స్ (తెల్ల గుర్రం) జనాభా 33 వేలు. నేను ఈ రాజధానిలోనే వుంటాను. ఈ రాష్ట్రం గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే కాశ్మీర్ అంత అందంగా వుంటుంది. ఇప్పుడు సమయం రాత్రి 11. ఇప్పుడిప్పుడే చీకటి పడుతోంది. అదేంటీ ఇంత ఆలస్యంగానా అని మీ అనుమానం కదూ. హహ. ఇంకో రెండు నెలలు అయితే వేసవిలో మేము అర్ధరాత్రి కూడా ఎంచక్కా సూర్యుడిని చూడొచ్చు. అప్పుడు రాత్రి రెండు మూడు గంటలు వుంటుంది అంతే. ఎందుకంటే ఇది ధ్రువానికి దగ్గర్లో వుంటుంది కాబట్టి.
ఇంటిపైకప్పునుండి బయట గోడపక్కగా నీటి ధార కారుతోంది. సన్నగా వర్షం పడుతోంది. దానికి తోడు ఇంటికప్పు మీద వున్న మంచు కూడా కరుగుతోంది. చిటపట చినుకుల శబ్దం ఆహ్లాదంగా వినపడుతోంది.
ఇక కరోనా సంగతికి వస్తే ఇక్కడ ఇప్పుడు ఏక్టివ్ కేసులే లేవు. దాదాపు 65 శాతం మందికి రెండు డోసుల వాక్సిన్ పూర్తి అయ్యింది. వారం క్రిందటే నేను రెండో డోసు వాక్సిన్ వేయించుకున్నాను. ఈ రాష్ట్రం దాటి ఎటు వెళ్ళి వచ్చినా లేదా బయటి నుండి ఈ రాష్ట్రానికి ఎవరు వచ్చినా రెండు వారాలు ఐసోలేషనులో వుండాలి. ఇండోర్ ప్లేసుల్లో మాస్క్ పెట్టుకోవాలని తప్ప వేరే పెద్దగా నిబంధనలు ఏమీ లేవు కాబట్టి హాయిగా ఆఫీసుకి వెళ్ళివస్తుంటాము, కలుస్తుంటాము, తిరుగుతుంటాము. కెనడాలో ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో కరోనా ప్రకారంగా అత్యంత సురక్షితమయిన ప్రాంతాల్లో ఇది ఒకటి అని చెప్పవచ్చు. అందుకే ఐసోలేషన్ గురించి ప్రసక్తి వస్తే మా స్థానిక మిత్రుడు రాజీవ్ అంటాడూ - మనం ఎలాగూ ఐసోలేటెడ్ నే కదా - ఇంకా వేరే ఎందుకూ? అని. అవును మరీ. ఈ ప్రాతం నార్త్ పోల్‌కి నియర్లో వుంటుంది. ప్రకృతి సౌందర్యం మీద మక్కువ వుంటే తప్ప ఇక్కడ ఇలా దూరంగా వుండలేం. ఇక్కడి గాలి, నీరు 98 శాతం స్వఛ్ఛంగా వుంటాయి.
మరిన్ని విశేషాలతో మరోసారి కలుద్దాం. ఇంకో రెండు వారాల్లో చాలా అవుట్ డోర్ ఏక్టివిటీస్ మొదలెట్టాల్సి వుంది. ఆ కబుర్లూ మీతో పంచుకుంటాను.

పొద్దుపోని ముచ్చట్లు - 1

ఈమధ్య నా బ్లాగులో సిటిజెన్ అని ఒకరు అడిగారు - కరోనా డైరీస్ వ్రాయమని. ఇప్పటికే దాని గురించి తెగ వింటున్నాం, చూస్తున్నాం. వ్రాయాలంటే ఇంకా ఎక్కువ ఆలోచించాలి కదా - ఎందుకు లెద్దూ అనుకున్నా కానీ పొద్దు పోవడం కోసమైనా సరే వ్రాసి చూస్తే పోలా అని ఇప్పుడు అనుకుంటున్నాను.

కరోనా మా దగ్గర  ఇలా వుందీ: కెనడాలోని మా రాష్ట్రంలో ప్రస్తుతానికి అయితే కొద్దిగానే వుంది. అదీ తగ్గుముఖం పడుతోంది. 246 cases. 4 deaths. లాక్ డవున్ ఏమీ లేదు కానీ వీలయినంతవరకూ ఇంటిదగ్గరే వుండమనీ, పది మంది కంటే ఎక్కువ గుమికూడవద్దనీ, రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాలనీ ఆర్డర్స్ వున్నాయి. వాతావరణం బావున్నప్పుడు మా ఇంటికి దగ్గర్లో వున్న యూవివర్సిటీ గ్రవుండ్స్ లో నడకకి వెళుతూ వుంటాను. ఇక పరుగు ప్రారంభించాల్సిందే  అనుకుంటూ వుంటాను కానీ పెద్ద సెల్ ఫోన్, సైన్‌ఫీల్డ్  సిరీస్‌లో జార్జ్ దగ్గర వుండేటువంటి పెద్ద వాలెట్ పెట్టుకొని ఎలా పరుగెత్తడం చెప్మా?

చాలామందిలాగే నేనూ ఇంట్లోంచి పనిచేస్తున్నా. నాకు ఇంట్లోంచి పని అంతగా ఇష్టం వుండదు. అస్తమానం పెళ్ళాం పిల్లల ముఖాలు మాత్రమే చూస్తూ వుండటం ఏం బావుంటుంది కానీ కష్టమయినా కొన్ని నెలలు తప్పేట్లుగా లేదు కదా.

ఇకపోతే మా నగరం లోని ఒకే ఒక్క డ్రైవ్ థ్రూ కరోనా టెస్టింగ్ సెంటర్ మా అపార్ట్మెంట్ ఎదురుగ్గానే వుంటుంది. మా ఇంట్లోంచి కూర్చున్నా, నిలుచున్నా క్లియర్‌గా కనపడుతూ వుంటుంది. ఎన్ని కార్లు వస్తున్నాయి, వెళుతున్నాయి చూడటం ఒక ఆబ్సెషన్‌లా అయిపోయింది. మూడువారాల క్రితం కార్లు బాగా కనపడ్డాయి. ఆ తరువాత బాగా తగ్గాయి. గత వారం రెండుమూడు రోజులకు ఒకసారి ఒకటీ రెండూ కనపడ్డాయి. ఇవాళ చూస్తే ఇంతవరకూ ఒక్క కారూ కనపడలేదు.

అమెరికా, ఇండియా లాంటి చాలా దేశాల్లాగానే మా ప్రభుత్వం కూడా ఆలస్యంగా విదేశీ ప్రయాణాలని కట్టడి చేసింది. అందువల్ల అప్పటికే కరోనా దేశంలోకి వచ్చేసింది. మన ప్రభుత్వాల అసమర్ధత వల్ల మనం అందరమూ కష్టాలని అనుభవిస్తున్నాం. కొద్ది దేశాలు ఎంచక్కా ముందే జాగ్రత్త పడ్డాయి. గ్జెనోఫోబియా అనుకుటారేమో అని సంకోచంతో మా ప్రధాని ఆలస్యం చేసినట్లుంది. లో రిస్క్, లో రిస్క్ అని చెబుతూ కరోనాకి తలుపులు చాలా వారాల పాటూ తెరిచే వుంచారు. 'ఓ కరోనా రేపు రా!' అని తలుపులు మూసేసి తాళం వెయ్యలేదు. మొత్తం మీద రెండు రాష్ట్రాల్లో తప్ప మిగతా వాటిల్లో సమస్య తగ్గుతూ వుండటంతో సంతోషిస్తున్నాం. క్విబెక్ అనే రాష్ట్రంలోదక్షిణ కొరియాలోకి మల్లే ఒక క్రిస్టియన్ కల్ట్  నిబంధనలు పాటించక తెగ పాకించేసారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే సగానికి పైగా కేసులు వున్నాయి. ఈ దేశంలో రాష్ట్రాలని ప్రొవిన్సులు అంటారు.

అప్పుడప్పుడు భౌతిక దూరం పాటిస్తూ ఇతర కుటుంబాలతో కలిసి కుటుంబ సమేతంగా పార్కులకు గట్రా వెళ్ళివస్తుంటాను. మా సిటీ మరీ అస్తామానం ఇంట్లోనే వుండండి అని ఏమీ చెప్పదు. పార్కులకు గట్రా వెళ్ళండి కానీ రెండు మీటర్ల దూరం పాటించమంటుంది. అలా పాటించకపోతే దాదాపుగా 500 డాలర్లు ఫైను. శారీరక మానసిక ఆరోగ్యాలూ ముఖ్యమే కాబట్టి మా కుటుంబాన్ని కూడా నడకకు వెళ్ళేందుకై ప్రోత్సహిస్తూ వుంటాను. ఈ వారం వాతావరణం బాగోలేదు కాబట్టి నడక సాగలేదు. వచ్చే వారం నుండి అంతా ప్లస్ లోనే (సెల్సియస్). అందువల్ల ఎంచక్కా ఇంట్లో పని అయ్యాకా, వారాంతాలలోనూ అలా అలా బయటకి వెళ్ళి రావొచ్చు. కావాలంటే లాంగ్ డ్రయివులకు కూడా వెళ్ళొచ్చు.

మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎలా గడుపుతున్నారు? మానసిక, శారీరక ఆరోగ్యాలు కాపాడుకునేందుకై మీరు ఏం చేస్తున్నారు?

మూడు రాజధానుల కంటే కూడా రిలే రాజధానులు లేదా సంచార రాజధానులు బావుంటాయి

మూడు రాజధానుల ఆలోచన అసలు అమలులోకి వస్తుందో లేదో తెలియదు కానీ ఆసక్తికరంగా అనిపించింది. ఆ తరువాత మరీ మూడేనా అనిపించింది. కొందరు ఒక్కో జిల్లాకి ఒక్కో రాజధాని ఇస్తే పోలా అన్నారు కానీ అందువల్ల ఖర్చు ఎక్కువవుతుంది. అలా కాకుండా నాకు మరో ఆలోచన వచ్చింది. అదే రిలే రాజధానులు. హిప్పీలు మొదలయిన సంచార జాతుల వారు ఒక దగ్గర వుండకుండా తమ నివాస స్థలాలని మారుస్తూ వుంటారు. అదే విధంగా రాజధానిని కూడా ఎప్పుడూ ఒకే చోట వుంచకుండా నెలకి ఒక జిల్లాకి మారిస్తే ఎలా వుంటుంది? ఇలాంటి సంచార రాజధాని వల్ల చాలా లాభాలు వున్నాయి. శాశ్వత భవనాలు, వగైరా ఖర్చులు వుండవు. ఎంచక్కా అప్పటికే వున్న R&B భవనాలో, PWD గెస్ట్ హవుజుల ముందటో టెంట్లు వేసుకొని నడిపించేయవచ్చు.

ముఖ్యమంత్రి గారు మాత్రం ఆయా భవనాల్లో ఆ నెల పాటూ నివసిస్తే సరి.  మిగతా సెక్రటెరియట్, హైకోర్ట్, అసెంబ్లీ, శాఖలు మొదలయినవి పెద్ద పెద్ద టెంట్లు, షామియానాలు వేసి లాగించొచ్చు. కానీ అలా ఒక్కో జిల్లాలో అలా అన్నీ ఒక్కో నెలా తిష్ఠ వేసుకొని కూర్చుంటే మిగతా జిల్లాల వారికి కోపం రావొచ్చు. అలాంటప్పుడు అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టులు విడివిడిగా ఒక్కో జిల్లాకి మారుస్తూ వుండాలి. అయితే ఇందులో కూడా ఒక సమస్య వుంది. ఒక క్రమ పద్ధతిలో ఒక్కో జిల్లాకి వరుసగా ఇవి మారుస్తూ వుంటే చివరి జిల్లాల వారు అసహనం చెందవచ్చు. ఆ ఇబ్బంది లేకుండా లాటరీ పద్ధతిలో ర్యాండమ్‌గా ఒక్కో జిల్లాకి ఇవన్నీ మారుస్తూ వుంటే గనుక ఎవరికీ ఏ ఇబ్బందీ అనిపించదు. అన్ని జిల్లాల వారు, అన్ని ప్రాంతాల వారు తమకి తగిన ప్రాధాన్యం లభించిందని ఆనందపడిపొవొచ్చు.

మరీ సంచార జాతుల వలె టెంట్లు ఏం బావుంటాయని మీరు అనుకుంటే గనక దానికి పరిష్కారం వుంది. టెంట్లకు బదులుగా కారవాన్లు, మొబయిల్ హోమ్‌లు లేదా రిక్రియేషన్ వెహికల్స్ (RV) వినియోగిస్తే సరీ.

గమనిక: నేను ఏ పార్టీ లేదా ఏ హీరో అభిమానిని కాదు. ఇది జస్ట్ నాకు వచ్చిన ఆలోచన మాత్రమే.

ఇదో దిక్కుమాలిన పోస్ట్ - Don’t read :))

చాలా వరకు అనుకున్నట్టుగా జరుగుతున్నాయి కానీ ...డబ్బు విషయాల్లో మాత్రం ఇంకా కలిసిరావడం లేదు ఎందుకనో. నేను Law of Attraction నమ్ముతూ వుంటాను అని మీకు తెలిసిందే. నిజంగా జరుగుతుంటాయో లేక Selective Thinking వల్ల అలా అనిపిస్తుందో కానీ ఎన్నో ఎన్నెన్నో బహు చిత్రంగా కలిసివస్తున్నాయి. కానీ... ఒక్క సంపాదన విషయంలో మాత్రం కలిసిరాకపోగా - డబ్బు వెనక వెయ్యకపోగా...ముందు వెయ్యడం జరుగుతోంది. ఎందుకని చెప్మా?! సెలెక్టివ్ థింకింగ్ వల్ల అయినా కానీ అందులో కలిసి వస్తున్నట్లు కనీసం భ్రమ అయినా కలగాలి కదా. అదీ లేదు, పైగా ఎన్నో ఎన్నెన్నో ఖర్చులు, అవసరాలు మాత్రం అన్ని విధాలుగా బహు బాహ్గా కలిసివస్తున్నాయి. వా...! :(

నా మొఖం. నేను ఇలా ఆలోచిస్తూ వుంటే, ఇంట్లో వాళ్ళూ ఇంతకంటే దరిద్రంగా ఆలోచిస్తూ వుంటే ఇలాగే వుంటుంది లెండి. లెక్క ప్రకారం ఇలాంటి వ్రాతలు వ్రాయకూడదు కానీ ఎప్పటినుండో ఇది కూడా మీతో పంచుకోవాలనే దిక్కుమాలిన ఆలోచన వుంటోంది. ఆ పనేదో చేస్తేనన్నా పీడా వదుల్తుందేమోననీ ఇదీ వ్రాయడం!

All is well. Don't worry. అప్పుడప్పుడూ నా బ్లాగుని ఇలా నా మనోస్ఖలనం కోసం ఉపయోగించుకుంటూంటా అని మీకు తెలుసును కదా :)) సర్లెండి - ప్రతి కుక్కకీ ఓ సమయం వస్తుంది కదా. మనం చెయ్యాల్సిందెల్లా ఆ సమయాన్ని ఫీల్ అవుతూ ఆ సమయం కోసం వేచివుండటమే. మనం అనుకున్నది 'ఎలా?' అవిష్కారం అవుతుందీ అన్నది మన సమస్య కాదు - అది విశ్వ సమస్య! ఆ సమయం ఆసన్నమయినప్పుడు అలా అలా అలవోకగా, అద్భుతంగా అవిష్కారం అవుతాయి అన్నీనూ. కంగారేమీ లేదు మిత్రమా.

హహ్! ఇన్నాళ్ళకి కామసూత్ర!

మొన్న ఒక ముప్పయి అయిదేళ్ళ పెళ్ళికాని మిత్రుడొకరు ఊరు మారుతున్నా అంటే సహాయం చెయ్యడానికి వెళ్ళాను. తను పుస్తకాల బరువు తగ్గించుకోవాలనుకుంటున్నాడు. Fifty Shades of Grey సిరీస్ వుంది కావాలా అడిగాడు. ఎగిరి గంతేసినంత పన్జేసి ఓ య్యెస్ అన్నా. ఎందుకో ఆ ఫిల్మ్ నెట్‌ఫ్లిక్స్  లో వున్నా ఇంతవరకూ చూడలేదు - తెలిసిన సబ్జెక్ట్ నే కదా అన్న ఉదాసీనత. సో, మనోడికి BDSM కాన్సెప్ట్స్ బాహ్గా తెలుసునేమో మనస్సులో అనేసుకొని నాకో Dom వుందబ్బా అని ఉత్సాహంగా అనేసా. మనవాడు తెల్లముఖం వేసేసాడు. దాంతో మనవాడికి అసలు ఆ  కాన్సెప్ట్స్ తెలుసా అని ఆ పుస్తకాలలో వున్న మెయిన్ థీమ్ ఏంటి చెప్పూ అని అడిగా.  ఏదేదో చెప్పాడు. అవేమీ కాదని BDSM అని చెప్పా. ఆ విషయాలేవీ అతనికి తెలియదు. ఆ సిరీస్ చదివి కూడా ఆయా విషయాలు తెలియకపోవడం ఆశ్చర్యం అనిపించింది. 

అటుపై కామసూత్ర పుస్తకం వుంది కావాలా అని అడిగాడు. మళ్ళీ ఎగిరి గంతేసినంత పనిచేసాను. వాత్సాయనుడు ఏదో చిన్న పుస్తకం వ్రాసేడనుకున్నా కానీ పెద్ద పుస్తకమే. ఇంగ్లీషు అనువాదం లెండి. పుట్టుకతో ఒక భారతీయుడనై వుండి ఇన్నేళ్ళుగా ఆ పుస్తకం చదవలేకపోవడం నాకు సిగ్గుగా అనిపించింది. చదవడం మొదలెట్టాను - ఉపోద్ఘాతం వరకే అయ్యింది ఈరోజుకి. కామసూత్రని అందించిన మనదేశం ఈరోజున శృంగారాన్ని ఎంత రోతగా చూస్తోందో అని ఆ విదేశీ అనువాదకుడితో పాటు నేనూ నిస్పృహ చెందేను. 

మీలో ఎవరయినా ఆ రెండు పుస్తకాలు కానీ ఒకటి కానీ చదివిన వాళ్ళు వుంటే మీ అభిప్రాయాలు పంచుకోండేం. 

telugu.telugupost.com సమీక్ష

http://telugu.telugupost.com/


       తెలుగు్‌పోస్ట్ నిర్వాహకులు తమ తెలుగు పోర్టల్ మీద సమీక్ష కోరినప్పుడు సహజంగానే నేను రోజూ చూసే ఒక 'గొప్ప' తెలుగు పోర్టలుతో తారతమ్యాలు ఏంటా అని పరిశీలించాను. దాన్ని వదిలి ఇది చూడాల్సినంత గొప్పదనం కానీ, ఆవశ్యకత కానీ ఏముందా అని పరిశీలించాను.  అందులో కొన్ని వార్తలు చికాకు కలిగిస్తుంటాయి. వార్తా ప్రాధాన్యత లేని వాటిని కూడా హిట్స్ కోసం ఏవేవో వ్రాస్తూ అసహనం కలిగిస్తున్నా, ఇంకా కొన్ని లోపాలున్నా కూడా కొన్ని గొప్పదనాలు వున్నయ్ కాబట్టి ఆ పోర్టలు రోజుకి ఒకసారి చూడనిదే నాకు నిద్రపట్టదు. ముఖ్యంగా అందులో ఒకరు వ్రాసే ఆర్టికల్స్ అరటిపండు ఒలిచిపెట్టినంత సులభంగా, ఆసక్తికరంగా, విశ్లేషణాత్మకంగా, సరదాగా  వుంటాయి. అవే కాకుండా వారి మోబయిల్ వెబ్సైట్ ఫాంట్ కానీ, అమరిక కానీ చాలా చక్కగా వుంటుంది కానీ వ్యాపార ప్రకటనలు ఎక్కువయ్యి మనం చదవాల్సిందెక్కడా అని ఆ పోర్టలులో వెతుక్కోవాల్సివస్తుంటుంది. 

     తెలుగుపోస్ట్ చూసినప్పుడు అలాంటి చెత్త పోస్టులు, రాతలు లేకుండా వ్యాసాలు పద్ధతిగా, హుందాగా, బ్యాలన్సుడుగా వున్నాయి. విశ్లేషణాత్మకంగా వ్యాసాలు వున్నాయి కానీ అంతా సీరియస్సుగానే వున్నాయి. అందులో కొన్నిటిలోనన్నా హాస్యం కనపడుతుందేమో అని చూసా కానీ అబ్బే లేదు. జనాలకి సమాచారం ఒక్కటే కాకుండా, వినోదం ఒక్కటే కాకుండా రెండింటినీ కలిపి ఇస్తే ఆ వ్యాసాలు ఇంఫొటైన్మెంటుతో ఆసక్తికరంగా, ఉపయోగకరంగా వుంటయ్. ఆ విషయాన్ని నిర్వాహకులు గుర్తించినట్లు లేరు. అలాంటివి కొన్ని అయినా ఇందులో వస్తుంటేనే బావుంటుంది. ఇందులో ఆర్టికల్స్ అన్నీ బావున్నప్పటికీ అన్నిటినీ ఒకరే వ్రాసేరా అన్నంతగా మూస పద్ధతిలో వున్నయ్. రచనా శైలిలో పెద్దగా వైవిధ్యం నాకు అయితే కనపడలేదు మరి. ఆ లోపాన్ని వీరు సరిచేసుకోవాల్సి వుంది.

     ఇకపోతే ఇందులో కేవలం రాజకీయాలు, సినిమాలు మాత్రమే వున్నాయి. వేరే ఆంశాల మీద పెద్దగా వ్యాసాలు లేవు. ఈ రాజకీయాలూ, సినిమాలూ అన్ని పోర్టల్స్ లో, టివిల్లో, పత్రికల్లో వుండేవే కదా. అవి దాటుకొని నాబోటి వాడు ఈ వెబ్‌సైటుకి రావాలంటే కొత్తదనం కనిపించాలి మరి. వెబ్సైట్ ఫాంట్, అమరిక బాగానే వున్నప్పటికీ నాలాంటివారు ఎక్కువగా చూసే మొబయిల్ సైటులో ఫాంట్ కానీ, అమరిక కానీ అంత ఆహ్లాదంగా అనిపించలేదు. ప్రస్తుతానికయితే వ్యాపార ప్రకటనలు లేకుండా, ఆ ప్రకటనల మధ్య అసలు విషయం ఎక్కడుందా అని వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా హాయిగా వుంది ఈ తెలుగు పోస్ట్ చూస్తూ వుంటే.  

ఈ సైటు చూస్తూ వుంటే క్వాలిటీ కంటెంట్ నిజాయితీగా, నిష్పక్షపాతంగా, హుందాగా చదువరులకు అందించాలనే తపన కనపడుతోంది. ఈ సైటు ఇంకా కొత్తదే కనుక మున్ముందు ఈ కమిట్మెంటుతో పాటుగా కొత్తదనాన్ని, వైవిధ్యాన్ని, ఇంఫొటైన్మెంటును వీరు అందించగలగితే మనకో చక్కని తెలుగు వెబ్ పోర్టల్ దక్కినట్లే. 

ప్రస్థుతానికి అయితే పాస్ మార్కులే వేస్తున్నా ఈ సైటుకి.  

http://telugu.telugupost.com/


మీరూ ఈ సైటు ని ఒక లుక్కేసి మీకెలా అనిపించిందో, నా అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారో లేదో చెబుదురూ.   

ఒక దీర్ఘకాల సమస్య తీరిపోయిందోచ్!

లాక్టోజ్ ఇంటోలరెన్సుతో ( Lactose Intolerance) నా యుక్తవయస్సు నుండీ అవస్థ పడుతున్నాను. అసలు విషయం అదని తెలియక ఇండియాలో వున్నప్పుడు ఎంతోమంది దద్దమ్మ డాక్టర్లకు నా సమస్య మొరపెట్టుకున్నాను. అదన్నారు, ఇదన్నారు కానీ ఒక్కడన్నా అది అయివుండొచ్చునేమో అని సూచనప్రాయంగా కూడా అనుమానం వెలిబుచ్చలేదు ఆ మా గొప్ప వైద్యులు. కెనడాకి వచ్చాక లాక్టోజ్ ఫ్రీ మిల్క్ చూసి అదేంటొ ఎయిడ్స్ ఫ్రీ మిల్క్ తరహాలో అనుకొని మనకెందుకులే అది అని పట్టించుకోలేదు. అలా గ్రోసరీకి వెళ్ళినప్పుడల్లా ఆ పాలు చూసి, చూసి ఆసక్తి పుట్టి నెట్టులో వెతికాను. అప్పుడర్ధమయ్యింది - నా లక్షణాలు అవేననీ, మన భారతీయులకే ఈ సమస్య ఎక్కువ వుంటుందనీనూ.  ఆ పాలు తెచ్చుకొని పరీక్షించా - నా సమస్యకి తాత్కాలిక పద్ధతుల్లో పరిష్కారం లభించింది. కానీ ఆ పాలకి ధర ఎక్కువ. ఇంట్లో పెరుగు అందరికీ ఆ పాలతొ చెయ్యాలన్నా, లేక ఏ ఇతర పాల పదార్ధాలు తిన్నా ఇన్నేళ్ళుగా ఇబ్బందిగానే వుండేది. ఎంత నెట్టులో పరిష్కారం కోసం వెతికినా పాలు పక్కన పెట్టమనే కానీ ఓ పరిష్కారం దొరకలేదు. ఇక లాభం లేదని ఈమధ్య లా ఆఫ్ ఎట్రాక్షన్ ప్రయోగించా.
   
అద్భుతః! ఒక దేశీ హెయి కటింగ్ సెలూన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దేశీ హోమియో డాక్టర్ కార్డ్ కనపడింది. పట్టుకొని వచ్చి ఫోన్ చేసి కలుసుకొని నా సమస్యలన్నీ మొరపెట్టుకున్నా. ఒక్క పాలే కాకుండా ఇంకా ఏవేవో ఫుడ్ ఇంటోలరెన్సులు కూడా వున్నయ్ నాకు. లాక్టోజ్ ఇంటోలరెన్సుతో సహా వాటిల్లో చాలా వాటికి పరిష్కారం లభించింది. హాయిగా పాలు పెరుగుతో పాటు నాకు ఇష్టం అయిన అహారం అంతా ఎంచక్కా తినగలుగుతున్నాను కానీ గోంగూర మాత్రం ఇంకా పడట్లేదు. అది తిన్న రోజు దగ్గు, జలుబు వగైరాలతో ఆ రాత్రి నాకు నిద్ర పట్టదు. ఇది కూడా తీరితే బావుండును - ఎందుకంటే నాకు గోంగూర పచ్చడి అంటే బాగా ఇష్టం మరీ. 

మీలో ఎవరికయినా లాక్టోజ్ ఇంటోలరెన్సు కానీ, ఫుడ్ ఇంటోలరెన్సులు కానీ, ఆస్మా లాంటివి కానీ వుంటే హోమియో మందులు వాడి చూడండి - మీకూ నయమై పోవొచ్చును.   

నిజమో లేక నా భ్రమో కానీ ఇలా ఒక్కొక్క సమస్యా LOAతో తీరిపోతూవుంటే, అన్నీ ఒక దాని తరువాత ఒకటి కలిసివస్తుంటే జీవితం భ్రహ్మాండంగా సాగిపోదూ? ఇంకో ముఖ్యమయిన సమస్య తీరడానికి రెండు నుండి మూడేళ్ళ సమయం వుంది. నా బ్లాగు మొదట్నుండీ చదువుతూవున్న వాళ్ళు అదేంటో అర్ధం చేసుకోవొచ్చు ;) బయటకి ఎందుకులెండి చెప్పుకోవడం - మీరే చూస్తారుగా మున్ముందూ :))  

కొవ్వు ఎక్కడ కరిగింది చెప్మా?

నాకు చిన్నప్పటి నుండీ వ్యాయామం అంటే వ్యామోహమే కానీ నా బాడీ తట్టుకోక తేలిగ్గా ఓవర్ట్రైనింగ్ సిండ్రోం (Overtraining Syndrome)  వచ్చేది. అసలు అది వస్తోందని కూడా తెలియక దాంతో చాలా అవస్థలు పడ్డాలెండి. ఆఖరుకి దానికి సరి అయిన పరిష్కారం ఈమధ్యే అర్ధమయ్యింది. వెయిట్స్ చేసాకా  ప్రోటీనుతో పాటూ కార్బోహైడ్రేట్స్ కూడా బాగా తీసుకోవాలని. బిక్కుబిక్కుమంటూ వెయిట్స్ చేస్తూ అలా కార్బోహైడ్రేట్స్ తో ప్రయొగాలు చేసా. ఫర్వాలేదు - ఫలించాయి. హమ్మయ్య ఇక భేషుగ్గా వెయిట్స్ చెయ్యొచ్చు కానీ వ్యాయామం వారాంతాలలో ఖచ్చితంగా ఆ రెండు రోజులూ చెయ్యగలుగుతున్నా కానీ వివిధ కారణాల వల్ల ఇతర వారం రోజుల్లో పెద్దగా కుదరడం లేదు. ఆ విషయాన్ని నేను సరి చెయ్యాల్సి వుంది.

వెయిట్స్ చేస్తూ సిక్స్ ప్యాక్ చెయ్యాలనే అత్యాశలేమీ లేవు కానీ ఫ్యామిలీ ప్యాక్ తగ్గించుకోవాలన్న ఉబలాటం మాత్రం వుంది.  నా బరువు సమస్య లేదు - ఎంత కావాలంటే అంత పెంచగలనూ - తగ్గించగలనూ. కాకపోతే బుల్లి బొజ్జ మాత్రం వుందండొయ్. తస్సాదియ్యా ఎంత ప్రయత్నించినా అది మాత్రం పోలేదు. సో, దానిమీద పడ్డా ఇకా. ఆ బుల్లి బొజ్జ రావడానికి ఓ కథ వుందిలెండి. నా యుక్త వయస్సులో బాహ్గా బక్కగా వుండేవాడిని. అలా లాభం లేదని చెప్పి బరువు, లావు పెరగాలనీ బాగా బీర్లు లాగించడమే కాక పెరుగులో నెయ్యి వడ్డించుకొని మరీ భోజనం చేసేవోడిని. అలా బరువు సంగతేమో కానీ బుల్లి బొజ్జ మాత్రం పెరిగిందండీ - మళ్ళీ తగ్గలేదు.

అయితే ఈమధ్య కాలంలో వారాంతాలో క్రమం తప్పకుండా వెయిట్స్ చేస్తూ దాని మీద దృష్టి పెట్టాను.  రోజూ ఉదయమే నా బరువూ, నా బాడీ ఫ్యాట్ % చూసుకుంటూ వుంటా. ఆ ప్రకారం నా శరీరంలో కొవ్వు క్రమంగా తగ్గుతోంది కానీ... కానీ.. బొజ్జ మాత్రం పెరగసాగింది. వా...! ఎక్కడ వుంది లోపం అని చూసా. వెయిట్స్ చేసినప్పుడు పలు కారణాల తాత్కాలికంగా బొజ్జ పెరగొచ్చు. ఓక్కే. అది సరే కానీ మరి కొవ్వు ఎక్కడ తగ్గుతోంది చెప్మా? జీన్స్ వగైరాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో ప్రదేశంలో ముందు తగ్గొచ్చు. మరి నాకు ఎక్కాడ? త్వరలోనే అర్ధమయ్యింది - జతొజడల్లో అని - ఐ మీన్ తోడల్లో. కండలు క్రమంగా బయటపడుతున్నాయి. సర్లెండి. ఎక్కడో చోట మొదలయ్యింది కదా, అదే సంతోషం. నెమ్మదిగా టమ్మీ ఫ్లాట్ అవుతుంది లెండి. మొత్తం కొన్ని వారాల్లో 1.5% బాడీ ఫ్యాట్ తగ్గించా. నా ఏజికి, గేజికి 13% నుండి 22% వుంటే సాధారణం. నాకు 21% వుండేది. ఈరోజు 19.5% వుంది. నా లక్ష్యం ప్రస్థుతానికి సరాసరిన 17.5%. నెమ్మదిగా బెల్లీ కూడా తగ్గుతున్నట్లుగానే వుంది. ఇవాళ ఒక బెల్ట్ రంధ్రం తగ్గించా మరి. 

మిగతా వారం రోజుల్లో కూడా చేస్తే ఇంకా మెరుగుదల బాగా వుండొచ్చు - ప్రయత్నిద్దాం. శని ఆది వారాల్లో ఉదయమే వెళ్ళి వస్తుంటారు. దగ్గర్లో వుండే యూనివర్సిటీ జిం చాలా బావుంటుంది - అలాంటి పెద్ద, మంచి జిం ఇంతవరకూ చూడలేదు. వారాంతాలల్లో ఉదయం 8 గంటలకి తెరుస్తారు. వెళ్ళి ఒక పదినిమిషాలు వార్మప్ కోసం ఏరోబిక్స్ చేసి, ఇక 50 నిమిషాలు ఎనరోబిక్స్ మీద పడుతాను. అలా గంట చేసేకా కొంత సమయం సానా (Sauna) లో గడిపి సేదతీరి ఇంటికి వచ్చి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ పడేస్తుంటాను.  అటుపై కూడా ప్రోటీన్ పై శ్రద్ధ పెట్టి తగిన ఆహారం తీసుకుంటూవుంటాను. అనుకున్న లక్ష్యం నెరవేరుతోంది - సంతోషం కాదూ.

ఎవరయినా బిట్‌కాయిన్ (భవిష్యత్) బిలియనీర్లు వున్నారా ఇక్కాడ?

ఈమధ్య సెలవులకి US వెళ్ళాను. (ప్రస్తుతం కెనడాలో వుంటున్నా లెండి). ఒక గృహప్రవేశానికీ వెళ్ళాను. సత్యనారాయణ వ్రతం జరుగుతోంది. పక్కనే వున్న మిత్రుడు ఒకరు నాతో అన్నాడిలా 'నేను కనుక బిట్‌కాయిన్ బిలియనీర్ అయితే కనుక నేనూ సత్యనారాయణ వ్రతం చేయిస్తా!'.  నేనన్నాను 'సత్యనారాయణ స్వామికి అలా లంచం పడేస్తున్నారా ఏంటీ?!'
అతనన్నాడూ 'తప్పేముందీ? అందరు ధనవంతులూ దేవుడికి ఇలా లంచాలు ఇస్తూనే వుంటారు కదా'. ఈస్నేహితుడు రిటైర్మెంట్స్ సేవింగ్స్ అన్నీ తీసి అందులో పెట్టాడు. అతను కొన్నప్పుడు బిట్‌కాయిన్ $4,000 వుండేది. మూడువారాల క్రితం అది దాదాపుగా $20,000 దాకా పెరిగి మళ్ళీ ఇప్పుడు $16,000 చుట్టుపక్కల వుంటోంది. ధర ఒకేసారి బాగా తగ్గినప్పుడు గుండె పట్టుకున్నాడు.

నేను US లో వ్యక్తిగతంగా కలిసిన మిత్రులందరూ బిట్‌కాయిన్స్ లో గానీ లేదా అలాంటి ఆల్ట్‌కాయిన్స్ (అన్నింటినీ కలిపి క్రిప్టోకరెన్సీ అనొచ్చు) లలో పెట్టుబడిపెడుతున్నారు లేదా పెట్టాలనుకుంటున్నారు. ఒక  నాకు తెలిసిన రెసిడెన్సీ చేస్తున్న డాక్టర్ తన ఆదాయాన్నంతా అందులోనే పెట్టేస్తున్నాడు. ఆ మిత్రులని అడిగి కొన్ని సందేహాలు తీర్చుకొని దీని సంగతేంటా అని రెసెర్చ్ మొదలెట్టా.

ఇప్పటిదాకా ఏదో వార్తల్లో చదవడమే కానీ మన బోటివాళ్ళు కూడా ఇలా వీటిల్లో పెట్టుబడి పెట్టొచ్చని నాకు తెలియదు. అన్ని రకాల సలహాలు పరిశీలించాను. వీటిల్లో రిస్క్ ఎక్కువ కాబట్టి మనం కూడబెట్టుకున్న డబ్బు అంతా తీసికెళ్ళి పెట్టడం మూర్ఖత్వం అంటున్నారు. కానీ అసలే ఇందులో పెట్టుబడి పెట్టకపోవడం కూడా మూర్ఖత్వమే అంటున్నారు మరి. అంచేతా... నేనూ ఓ క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారును అవుదాం అనుకుంటున్నా. మార్కెట్ అధ్యయనం చేస్తున్నా. బిట్‌కాయిన్ లాంటివి వందల కొద్దీ వున్నాయి. ఇక్కడి యువతలో మూడొంతులు వీటిల్లోనే పెట్టుబడులు పెడుతున్నారంట. నాకు బిట్‌కాయిన్ మీద ఆసక్తి లేదు. నాకు ఇథేరియం - Ethereum  (ఇథ్ కాయిన్ - Eth) ఆసక్తికరంగా అనిపిస్తోంది. ముందయితే అందులో పెట్టుబడి పెట్టి చూస్తా. మరీ ఎక్కువ కాదులెండి. నా నెట్ ఎర్నింగ్స్ లో 10%. రిస్క్ వుంది నాకు తెలుసు - ఈ మాత్రం పెట్టుబడి నేను కోల్పోయినా భరించేయగలను.    ఈ రిస్క్ కూడా తగ్గించుకోవడానికి నా ప్లాన్లు నాకు వున్నాయి.

నాకు స్టాక్స్ అర్ధం కావు కానీ ఇది ఆసక్తికరంగా వుండటంతో కాస్తంత అర్ధం అవుతోంది. మొత్తం మీద ఇది ఒక వ్యసనం లాంటిది అని అర్ధం అయ్యింది. ఈ అంటువ్యాధి తగిలితే కనుక వదలడం కష్టం. అందుకే మీకూ ఎక్కించాలని చూస్తున్నా :)) మీలో ఎవరికయినా ఈ వ్యాధి ఇప్పటికే అంటివుంటే వ్యాఖ్యల్లో చర్చిద్దాం రండి.

అన్నీ అనుకున్నట్లుగా జరిగిపోతున్నాయ్

ఏదయినా సృజనాత్మకంగా పని చేస్తూ అందరినీ కలుపుకుపోతూ బ్యుజీ బ్యుజీ వుండాలనుకునేవాడిని. షార్ట్ ఫిల్మ్స్ ప్రయత్నిస్తున్నాం కదా. అందరూ ఉత్సాహంగా వున్నారు. అన్నా అన్నా అంటూ అందరూ తోడు నిలుస్తున్నారు. అయితే నటన తప్ప అన్ని విషయాలు నేనే చూసుకోవాల్సి రావడం వల్ల మా ప్రొడక్షన్ కాస్త ఆలస్యం అవుతున్నా కూడా అన్నిటిమీద మంచి అవగాహన కలుగుతోంది. మంచి అనుభవం వస్తోంది. ప్రస్తుతం ఇంకా ప్రాక్టీసు చేస్తూనే వున్నాం.  పగ అనే రెవెంజ్ స్టొరీ ని తీసుకున్నాం. అందులో ఎన్నో పొరపాట్లు జరుగుతున్నయ్ కానీ వాటిల్లోంచే ఎంతో నేర్చుకుంటున్నాం. ఆ ఫిల్మ్ ఇంకా రెండు వారాల్లో పూర్తి అవుతుంది. వ్యవధి 20 నిమిషాలు.  అయితే మీకు కానీ, పబ్లిక్ కి కానీ అది షేర్ చేసే వుద్దేశ్యం లేదు - ఎందుకంటే మా సిల్లీ మిస్టేక్స్ చూసి మీరంతా నవ్వేస్తారు :))

అటుపై సరాసరిన వారానికి ఒక 10 నిమిషాల లఘు చిత్రం నిర్మించాలనుకుంటున్నాం.